వాము లేదా ఓమను సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ వాన్ అని అంటారు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి.వాము శరీరంలో వాతాన్ని హరింపజే స్తుంది. శూలలను తగ్గిస్తుంది.జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి.దీని శాస్త్రీయ నామము -Trachyspermum copticum.
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అనే అమ్మమ్మల మాటలు గుర్తుండేవుంటాయి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు.
- వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.
- ఔషధోపయోగాలు
- వాంతులు : వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
- జ్వరం : వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
- అజీర్ణం : వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
- దంత వ్యాధులు : వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
- వాత వ్యాధులు : వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
- గొంతులో బాధ : వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
- జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
- ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
- గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
- కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
- పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
- దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.
- వాము, వెనిగార్ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే కిడ్నీలో వున్న రాళ్లు యూరిన్ ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
వాము భారతదేశ వాసులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా మన రాష్ట్రంతో సహా మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరిచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు.
ఆయుర్వేదీయ గుణకర్మలు
దీపనీయ (ఆకలి అనే అగ్నిని తట్టి లేపుతుంది), పాచక (అరుగుదలను పెంచుతుంది), శూలప్రశమన (పేగుల కండరాల్లో పట్టును సడలించి నొప్పి తగ్గేలా చేస్తుంది), స్తన్యజనన (తల్లిపాలు తయారయ్యేలా చేస్తుంది), శ్వాస (ఊపిరి పీల్చుకోడానికి సహాయపడుతుంది), అనులోమ (పేగుల్లోని మలం కిందకు కదలడానికి సహాయపడుతుంది), ఆమనాశక (విషతత్వాలను జీర్ణం చేసేస్తుంది), శూలప్రశమన (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గిస్తుంది), క్రిమిగ్ఘ (పేగుల్లోని ఆంత్ర క్రిములను, పరాన్నజీవులను చంపుతుంది), వాతకఫహరం (వాతాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది).
- గ్రంథోక్త ఆయుర్వేద చికిత్సలు
- వాము చూర్ణాన్ని, బిడా లవణాన్ని ఒక్కోటి రెండు గ్రాములను అర గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అరుగుదల పెరుగుతుంది. శరీరంలోపల పెరిగే బల్లలు కరిగిపోతాయి. (చరకసంహిత, వృందమాధవ).
- వాము చూర్ణం, చిత్రమూలం వేరు చూర్ణం ఒక్కోటి రెండేసి గ్రాముల చొప్పున ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే అర్శమొలలు తగ్గుతాయి.
- వాము, శొంఠి, చిరుబొద్ది, దానిమ్మ రసం, బెల్లం వీటిని ఉప్పు కలిపిన మజ్జిగతో తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది.
- వాము, సైంధవ లవణం, కరక్కాయ పెచ్చులు, శొంఠి వీటి చూర్ణాలను సమంగా కలిపి రెండు గ్రాముల మోతాదుగా అరకప్పు వేడి నీళ్లకు కలిపి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
- వామును బెల్లంతో కలిపి వారంపాటు తీసుకుంటే దద్దుర్లు తగ్గుతాయి.
- వామును బుగ్గనుంచుకొని రసం మింగుతుంటే కొండనాలుక వాపు తగ్గుతుంది. ఇలా ఒక పగలు, ఒక రాత్రి నిరంతరమూ చేయాలి.
- రాత్రిపూట వామును, వస కొమ్మును సమభాగాలను పలుకులుగా చూర్ణించి చిటికెడు మోతాదుగా నోట్లో ఉంచుకొని దంతాలమధ్య ఒత్తిపట్టి ఉంచుకుంటే దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- 200నుంచి 250 గ్రాముల వామును పెనంమీద వేడి చేసి, మెత్తని పల్చని నూలుగుడ్డలో పోసి మూటగాకట్టి పెనంమీద వేడి చేసి బాగా గాఢంగా వాసన పీల్చితే తుమ్ములు వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
- వామును శుభ్రంచేసి మెత్తగా దంచి చూర్ణం చేసుకోండి. ఈ చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు మోతాదుగా ముక్కు పొడుము మాదిరిగా గాఢంగా పీల్చితే తలనొప్పి, ముక్కు దిబ్బడ, తలదిమ్ము వంటి సమస్యలు తగ్గుతాయి.
- ఒక గుప్పెడు వామును కచ్చాపచ్చాగా దంచి ఒక కాటన్ దస్తీలో మూటకట్టండి. దీనిని పిల్లలు పడుకునే దిండు పక్కను వుంచండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు పసి పిల్లల్లో ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
- ఒక గుప్పెడు వామును కాటన్ గుడ్డలో మూటగా చుట్టండి. దీనిని ఒక పెనం మీద వేడి చేయండి. సుఖోష్ణ స్థితిని తడిమి చూసి ఛాతిమీద మెడమీద ప్రయోగిస్తే ఉబ్బసం, బ్రాంకైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
- పావు టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపును ఒక బొవెన్‌లో తీసుకోండి. ఒక టీ కప్పు వేడి నీళ్ళు కలపండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జలుబు, జలుబువల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
- ఒక ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి నీళ్లుపోసి వేడి చేయండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ దంచిన వామును కలపండి. దీనినుంచి వచ్చే ఘాటు ఆవిరిని గాఢంగా పీల్చితే జలుబువల్ల ఏర్పడిన ముక్కుదిబ్బడ తొలగిపోతుంది.
- రెండు టీ స్పూన్ల వామును మెత్తగా దంచండి. ఒక గ్లాసు మజ్జిగకు కలిపి తీసుకుంటే కఫం పల్చబడి ఊపిరితిత్తుల్లోకి గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి.
- అర లీటర్ మరిగే నీళ్లకు ఒక టీ స్పూన్ వాము చూర్ణాన్ని, ఒక టీ స్పూన్ పసుపు చూర్ణాన్ని కలిపి చల్లార్చండి. దీనిని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే, జలుబు ఛాతిలో కఫం పేరుకుపోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
- ముక్కు కారటం, దగ్గు తెరలు తెరలుగా రావటం ఇలాంటి స్థితుల్లో వాము స్పటికాలను 125మి.గ్రా. నెయ్యి 2గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి రోజుకు 3సార్లు తింటే కఫాధిక్యత తగ్గి దగ్గులో ఉపశమనం లభిస్తుంది.
- అర టీ స్పూన్ వామును, రెండు లవంగాలను, ఒక చిటికెడు ఉప్పును కలిపి చూర్ణించి అరకప్పు వేడి నీళ్లకు కలిపి కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగితే దగ్గు తగ్గుతుంది.
- వాము చూర్ణాన్ని రెండునుంచి మూడు గ్రాములు వేడి నీళ్లలో గాని లేదా వేడి పాలతో గాని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే జలుబు, తలనొప్పి, పడిశము వంటివి తగ్గుతాయి.
- దగ్గు, జలుబుతో కూడిన జ్వరాల్లో వాము 2గ్రాములు, పిప్పళ్లు అరగ్రాము వీటితో కషాయం తయారుచేసి 5నుంచి 10మి.లీ. మోతాదులో తీసుకుంటే అమితమైన ఫలితం కనిపిస్తుంది.
You have worked nicely with your insights that makes our work chicken vindaloo near me. The information you have provided is really factual and significant for us. Keep sharing these types of article, Thank you.
ReplyDelete